
అమరావతి, 25 మే (హి.స.)
తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై ఆదివారం సాయంత్రం 6 గంటలు దాటాక మంటలు ఎగసిపడ్డాయి. ఈదురుగాలులు తోడవడంతో పెద్దఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ అలీంబాషా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో వీలున్నంత వరకు ఆర్పేసి.. చుట్టూ విస్తరించకుండా అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గతంలోనూ ఉండవల్లి కొండకు నిప్పంటుకొని తగలబడిన ఉదంతాలున్నాయి. కానీ, ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. కొండను ఆనుకుని ఒకవైపు ఉండవల్లి, మరోవైపు పెనుమాక గ్రామాలు ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉండవల్లి కొండల్లో అగ్గిరాజుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు.. గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో రాత్రి సమీక్షించారు. ‘ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాం. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కాలనీలు, జనావాసాల వైపు విస్తరించకుండా చేశాం. చర్చి దగ్గర్లోకి మంటలు వ్యాపించగా.. వెంటనే అరికట్టాం. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు. ఉండవల్లి సమీపంలోని కుమ్మరిగుంట చెరువు వద్ద 2 అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాం’ అని కలెక్టర్, అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ.. ‘మంటలు పూర్తిగా ఆరిపోయేంతవరకూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి’ అని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ