
అమరావతి, 25 మే (హి.స.)
అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు, భారీ డిస్ప్లే హోర్డింగ్లు విద్యుత్ స్తంభాలపై పడినట్లు అధికారులు.. మంత్రికి వివరించారు. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను అత్యవసరంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను.. మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఎక్కడికక్కడ దెబ్బతిన్న లైన్లను క్లియర్ చేస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ