
మెదక్, 25 మే (హి.స.)
పది రోజుల్లో ధాన్యం కొనుగోలు
ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు అధైర్య పడద్దని, ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి నర్సాపూర్ లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు వెంట వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ, లోడింగ్-అన్ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేపడుతున్నామని తెలిపారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు... ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు