
హైదరాబాద్, 25 మే (హి.స.)
హోటల్ వెయిటర్ ముసుగులో నిరంతరం పాకిస్తాన్ ఉగ్రవాదులతో టచ్ లో ఉంటు మన దేశంలోని కొంత మంది ప్రముఖుల వివరాలను చేరవేస్తున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన జహీద్ ఖాన్ అనే యువకుడిని కౌంటర్ ఇంటెలిజెన్స్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు డమ్మీ పిస్టళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఉత్తర్ప్రదేశ్కు చెందిన జహీద్ ఖాన్ కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు ఫైజల్ ద్వారా ఉపాధి కోసం మేడ్చల్ వచ్చాడు. ఇక్కడి స్థానిక హోటల్లో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జహీద్కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఓ అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అతను బొమ్మ తుపాకులను ప్రదర్శిస్తూ కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాడు.
జహీద్ ఖాన్ చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని గమనించిన పాకిస్థాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ సానుభూతిపరులైన హబీబ్, రాణా హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ ద్వారా జహీద్ను సంప్రదించారు. హబీబ్, రాణా హుస్సేన్లకు పాకిస్థాన్లో ఉన్న ఐఎస్ఐ తీవ్రవాది షెహబాద్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ ముఠా జహీద్ను తమ ఉగ్రవాద గ్రూపులోకి లాగేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే అతడికి అసలైన తుపాకులనూ సరఫరా చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. జహీద్ కూడా తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ, సదరు వ్యక్తులతో నిరంతరం వాయిస్ కాల్స్, చాటింగ్ ద్వారా టచ్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి.సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిఘా ఉంచిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు జహీద్ జరుపుతున్న అనుమానాస్పద చాటింగ్లు, వాయిస్ కాల్స్ను సాంకేతిక విశ్లేషణ ద్వారా గుర్తించారు. అతను దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాడని నిర్ధారించుకుని మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అలర్ట్ అయిన మేడ్చల్ పోలీసులు సదరు హోటల్పై దాడిచేసి జహీద్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు నకలీ పిస్టళ్లను, మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi