
బెంగళూరు 25 మే (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పర్యటన మార్గంలో జిలెటిన్ స్టిక్స్ లభించిన ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు వీరిని సస్పెన్షన్లో ఉంచుతున్నట్లు బెంగళూరు సౌత్ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 10న ప్రధాని మోదీ బెంగళూరులో పర్యటించారు. ఆయన కార్యక్రమం ప్రారంభం కావడానికి గంటన్నర ముందు, నగర శివార్లలోని కగ్గలీపుర-తాతగుని ప్రాంతంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం సమీపంలో రెండు జిలెటిన్ స్టిక్స్ ఉన్న ప్యాకెట్ను పోలీసులు గుర్తించారు. డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ రోడ్డు పక్కన గోడ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్ను గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన యాంటీ-సబోటేజ్ బృందం వాటిని స్వాధీనం చేసుకుని జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఈ ఘటనపై బెంగళూరు సిటీ, రామనగర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఇవి లభ్యమయ్యాయని, వీటిని అక్కడికి ఎవరు చేర్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ రేంజ్ డీఐజీ గిరీష్ తెలిపారు.
ఈ పరిణామంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. ప్రధాని పర్యటనలో పేలుడు పదార్థాలు దొరకడం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో, ముఖ్యంగా బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi