ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ
ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ
Prime Minister Modi gave a message of nature and prosperity


ఫల్టా, 25 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, బెదిరింపు రాజకీయాలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పండా 1,49,666 ఓట్లు సాధించి, సమీప సీపీ(ఎం) అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై 1,09,021 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కుర్మీకి 40,645 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లాకు 10,084 ఓట్లు పోలయ్యాయి. అధికార టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కేవలం 7,783 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.

ఈ గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ ఫల్టా ప్రజలు తమ తీర్పు ఇచ్చారు. రికార్డు మెజార్టీతో గెలిచిన దేబాంగ్షు పండాకు అభినందనలు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై ఉన్న అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందిస్తూ.. ఫల్టా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, టీఎంసీ ఒక మాఫియా కంపెనీగా మారిందని ఆయన ఆరోపించారు.

ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా ఈవీఎంలపై పెర్ఫ్యూమ్ వంటి ద్రవ్యం చల్లడం, ఇంక్ మరకలు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం మొత్తం 285 బూత్లలో మే 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. భారీ భద్రత నడుమ ఈ రీపోలింగ్ జరిగింది. పోలింగ్కు రెండు రోజుల ముందు టీఎంసీ అభ్యర్థి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆయన పేరు ఈవీఎంలో కొనసాగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande