
ఆదిలాబాద్, 27 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాళం
వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ వన్టన్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన జైచంద్, ప్రేమ్ శాలిక్ రామ్ ఖత్రి, సతేంద్ర గుప్తా అనే ఈ కరడుగట్టిన నేరస్తులు ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 23న ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో జరిగిన చోరీ కేసును సవాల్ తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. మహారాష్ట్రలో దొంగిలించిన స్విఫ్ట్ డిజైర్ కారుకు ఫేక్ నెంబర్ ప్లేట్లు, ఫేక్ ఫాస్ట్యాగ్ అమర్చి రాష్ట్రాల మధ్య సంచరిస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు తేలింది. నిందితులు ఆదిలాబాద్ లో చోరీ చేసిన అనంతరం కామారెడ్డి, వరంగల్ ప్రాంతాల్లో కూడా భారీ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. వీరిపై గతంలో హత్య, హత్యాయత్నం, రాబరీ, చైన్ స్నాచింగ్ వంటి పలు తీవ్రమైన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఐ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీల సమయంలో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా పరారయ్యే యత్నం చేసిన నిందితులను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 33 తులాల బంగారం, 71 తులాల వెండి, ఒక కారు, నాలుగు సెల్ఫోన్లు, నగదు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బంగారం విలువ సుమారు రూ.46.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు