మైనర్ బాలికను నమ్మించి లైంగిక దాడి.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
మైనర్ బాలికను నమ్మించి లైంగిక దాడి.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
Pocso


హైదరాబాద్, 27 మే (హి.స.)

అంబర్పేట్ పోక్సో కేసులో కోర్టు

తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే నిందితుడు వడ్లూరి పవన్ (22) కు బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయితే విరి పరిచయం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు నిందితుడిని గురించి బాలికను నిలదీసారు. దీంతో 16 జులై 2022 తేదీన బాధితురాలు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే నిందితుడు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి, తన నివాసానికి తీసుకువెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం 180 BNS ప్రకారం బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కొరకు ఈ కేసును 'భరోసా' (Bharosa) కేంద్రానికి బదిలీ చేశారు. నిందితుడిపై ఐపీసీ (IPC) సెక్షన్ 376(3) మరియు పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 5(1) r/w 6 కింద మోపబడిన నేరారోపణలు రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (Rigorous Imprisonment) మరియు రూ. 10,000- జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలికి, ఆమె కుటుంబానికి భరోసా బృందం నిరంతరం కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించి అండగా నిలిచింది. అంతేకాకుండా, నిరంతర ఫాలో-అప్ సెషన్ల ద్వారా వారికి నైతిక మరియు మానసిక మద్దతును అందించింది. నిందితుడికి శిక్ష పడటం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యంత హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు, భరోసా కేంద్రం అధికారుల సమన్వయ కృషిని ఉమెన్ సేఫ్టీ డీసీపీ డా.లావణ్య NJP, ఉమెన్ సేఫ్టీ ఏసీపీ ప్రసన్న లక్ష్మి, భరోసా ఇన్స్పెక్టర్ పి.పద్మ నిరంతరం పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ఐపిఎస్ ఈ కేసులో భాగస్వామ్యమైన అధికారులు, సిబ్బంది అందరి సమన్వయాన్ని, నిరంతర కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande