అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కేటీఆర్


హైదరాబాద్, 27 మే (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల

(Unseasonal Rains), కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ( KTR) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రైతాంగానికి అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఆపత్కాలంలో రైతన్నలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంటు లేక సెల్ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతుల ఆరుగాలం కష్టం కళ్లముందే నీళ్లపాలవుతోందని ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

రైతుల పక్షాన నిలబడి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని దిశానిర్దేశం చేశారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు (MSP) ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకో వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande