పేదవాడి ఆత్మగౌరవానికి పెద్దపీట.. మంత్రి పొంగులేటి
పేదవాడి ఆత్మగౌరవానికి పెద్దపీట.. మంత్రి పొంగులేటి
Minister


హైదరాబాద్, 27 మే (హి.స.)

తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లో తొలి దశగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుండగా, 24 నియోజకవర్గాల్లో ఎస్ఐజీ (LIG) ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాల పరిశీలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి బుధవారం నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురా నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థలాల అనుకూలత, నిర్మాణ అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేదలు జీవనోపాధి కోసం నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా కాకుండా, అదే ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వినియోగించి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. “పేదవాడి ఆత్మగౌరవమే ప్రభుత్వానికి ముఖ్యము అన్న భావనతో కోర్ అర్బన్ ప్రాంతాల్లోనే గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తొలి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్లు, రెండో విడతగా మరో రెండు లక్షల ఇళ్ల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని, ప్రాంతంలో నివసించే నిరుపేదలకు అదే ప్రాంత పరిధిలో ఇళ్లు కేటాయించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల ప్రజలు ఉపాధిని కోల్పోకుండా, కుటుంబాలతో స్థిరంగా జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నగరాలకు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కారణంగా అనేక కుటుంబాలు అక్కడ నివసించలేకపోయాయని, కొన్ని ఇళ్లు ఖాళీగా మిగిలిపోయాయని విమర్శించారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భూమి విలువ కంటే పేదల జీవన గౌరవానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఏ ముఖ్యవ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్బన్ ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande