పోలవరం అడవుల్లో పులి సంచారం
పోలవరం అడవుల్లో పులి సంచారం
పోలవరం అడవుల్లో పులి సంచారం


పోలవరం, 29 మే (హి.స.)

:పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులి కదలికలు గుర్తించిన అధికారులు, పులి సమీప గ్రామాల వైపు సంచరిస్తోందని వెల్లడించారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే హనుమాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించారు.

చికిలింత పంచాయతీ పరిధిలోని ఒక పశువుల పాకపై పులి దాడి చేయగా, ఈ ఘటనలో 9 దూడలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే అడవికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ ఫామ్ తోటలో కూడా పశువులపై దాడి జరిగినట్లు వెల్లడించారు. పులి సంచారంపై ఆధునిక సాంకేతికతతో నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో నిరంతర అప్రమత్తత కొనసాగించాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

మనుషులు, పశువుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అటవీ శాఖకు స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు హనుమాన్ బృందాలను పంపాలని కూడా సూచించారు. మొత్తం ఆపరేషన్పై PCCF స్వయంగా పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ అధికారిని ఘటనాస్థలికి పంపాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

పులి సంచారం ఉన్న గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని, ప్రజలు అనవసరంగా అడవుల్లోకి వెళ్లకూడదని హెచ్చరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పశువులను అడవి సమీపంలో కట్టివేయకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించామని, త్వరలో పూర్తి పరిహారం చెల్లిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande