దమ్ముంటే నా సవాల్ స్వీకరించు.. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి మరోసారి చాలెంజ్
దమ్ముంటే నా సవాల్ స్వీకరించు.. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి మరోసారి చాలెంజ్
Ponguleti


హైదరాబాద్, 29 మే (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్ల పర్వం రంజుగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇరువురి మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. ఈ క్రమంలో 'సవాళ్లు చేయడం..పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటు!'అంటూ ఎక్స్ వేదికాగ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లే మాప్రభుత్వానికి రిఫరెండం అని, ఈ సవాల్ను స్వీకరించే దమ్ముందా లేదా కేటీఆర్? అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేకే హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్. అదే హైదరాబాద్లో ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాది చేతల ప్రభుత్వం కాబట్టే చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే... తొలి రెండున్నరేళ్లలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామన్నారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నామని హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరంటూ కేటీఆర్ పై మంత్రి ధ్వజమెత్తారు. ఈ విషయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మీ సోదరి కవిత సైతం ప్రస్తావించారన్నారు.

దమ్ముంటే నా సవాల్ స్వీకరించు:

మీవన్నీ ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలని, 2014 కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? పదేళ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. గ్రామాల్లో మీరు పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇండ్లు నిర్మించిందన్నారు. హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణంపై మరొక్కసారి సవాల్ విసురుతున్నానని.. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి మీరు దూరంగా ఉంటారా? దమ్ముంటే సవాల్ను స్వీకరించు కేటీఆర్ అని చాలెంజ్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande