ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
BJP chief


కరీంనగర్, 30 మే (హి.స.)

రాష్ట్రంలో ధాన్య సేకరణ ప్రక్రియ

పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో నిర్వహించిన పార్టీ సంస్థాగత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో రైతులు తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి, తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.

కేంద్రం మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు వ్యయాన్ని భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచిపెట్టి కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని తమ పై నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. ధాన్య సేకరణ పై అధికారులు, మంత్రుల ప్రకటనల్లో పొంతన లేకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వర్షాలతో నష్టపోయిన వరి, మామిడి రైతులను ఆదుకోవాలని, కలెక్టర్లు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande