అక్రమార్కులపై ఉక్కు పాదం.. పోలీసుల కార్డెన్ సెర్చ్..
అక్రమార్కులపై ఉక్కు పాదం.. పోలీసుల కార్డెన్ సెర్చ్..
Police


మహబూబాబాద్, 30 మే (హి.స.)

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, అసాంఘిక శక్తుల కార్యకలాపాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ దోహదపడుతుందని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ అన్నారు. శనివారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని కోటియా తండా గ్రామ పంచాయతీ పరిధిలో చౌల తండా, జాల్ తండా, అర్లగడ్డ తండా లో కార్డన్ పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా తండాల్లో సుమారు 50 లీటర్ల సారా, 4 క్వింటల్ నల్ల బెల్లం, 50 కిలోల పటిక స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసినట్లు ఆయన వెల్లడించారు.

అదేవిధంగా అక్రమంగా సారాయి తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమాచారం అందించాలని కోరారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్ హెచ్ ఓ గండ్రాతి సతీష్, చిన్నగూడూరు ఎస్సై కుశ కుమార్ 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande