
ఆసిఫాబాద్, 30 మే (హి.స.)
జూన్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. వాస్తవానికి జూన్ రెండో తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటన ముందుగా ఖరారు కాగా తాజాగా ఆయన పర్యటన ఒకరోజు ముందుగానే ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించేందుకు టూర్ ఖరారు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆలోచిస్తున్న తుమ్మిడి హేట్టి ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారని కూడా కాంగ్రెస్ వర్గాలు ముందుగా చెప్పాయి. కానీ తాజా పర్యటనలో ఆ పర్యటన లేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరై నేరుగా హెలికాప్టర్ లో ఆయన ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలం కొటారి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 38 ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టిన తర్వాత కొలాం ఆదిమ గిరిజనులతో సమావేశం అవుతారు. అనంతరం రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ మీదుగా కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమం అనంతరం సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలోనే బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరిఖని కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు దండే విఠల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..