
యాదాద్రి భువనగిరి:30 మే (హి.స.)
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యాత్రలో భాగంగా మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, ధాన్యం నిల్వలు, లారీల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు.
జూన్ 2వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తరలించాలని, ఆ తర్వాత కూడా ధాన్యం కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం వెంకటాపురం వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్లాన్కు పలుచోట్ల లీకేజీలు ఉన్నట్లు గుర్తించి మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా మరమ్మతులు చేపట్టాలని కోరగా, మంత్రి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో ప్రజలు తెలిపిన వివిధ సమస్యలను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు