పంజాబ్లో హైఅలర్ట్- రెండు గంటల్లో 2చోట్ల పేలుళ్లు- రంగంలోకి NIA
పంజాబ్లో హైఅలర్ట్- రెండు గంటల్లో 2చోట్ల పేలుళ్లు- రంగంలోకి NIA
panjab


జలంధర్, 06 మే (హి.స.)పంజాబ్ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు గంటల్లోనే 2 చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ రెండు ఘటనలూ ఆర్మీ యూనిట్లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళనలకు గురు చేస్తోంది. జలంధర్, అమృత్సర్ నగరాల్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ క్రమంలోనే స్పందించిన అధికారులు, ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైనా దర్యాప్తు చేపట్టారు. అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

పంజాబ్లోని జలంధర్లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద స్కూటర్ పేలుడు కలకలం రేపింది. కంటోన్మెంట్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. భద్రత పరంగా అత్యంత సున్నితమైన ప్రదేశంలో భారీ పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక కారణాలా లేక కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో పేలుడు ఘటన నమోదైంది. రాత్రి BSF హెడ్క్వార్టర్స్ ముందు ఉన్న యాక్టివ్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడున్న యువకుడు పారిపోతున్నట్లు కనిపించింది. పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు డ్వాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మిలటరీ కంటోన్మెంట్ మొత్తాన్ని దిగ్బంధించి సోదాలు చేస్తున్నారు. నిఘా, పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడిని గుర్తించి, అతని కదలికలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జలంధర్ నగరం అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ఈ ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అమృత్సర్లో మరో పేలుడు జరిగింది. అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశంలో రేకును పోలిన శకలాలు దొరికాయని, దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, దాడి చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలింది. అయితే, ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande