
న్యూఢిల్లీ, 06 మే (హి.స.)
దేశంలోని ప్రతి కేసు కీలకమేనని, శబరిమల కంటే ఈ కేసు ముఖ్యం అంటూ కేంద్రం పై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని (CJI) తొలగిస్తూ కేంద్రం తీసుకొచ్చిన 'ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం, 2023'ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తా ధ్వజమెత్తారు. ఈ కేసు విచారణను వాయిదా వేయాలని భారత సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోరారు. సీజేఐ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం విచారిస్తున్న 'శబరిమల రివ్యూ' కేసులో తాను బిజీగా ఉన్నందున, ఈ విచారణను వాయిదా వేయాలని ఆయన విన్నవించారు. అయితే, జస్టిస్ దత్తా ఈ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
వాయిదా ఇవ్వడానికి నిరాకరిస్తూ, జస్టిస్ దత్తా నేటి వార్తా పత్రికల్లో వచ్చిన ఒక కథనాన్ని ప్రస్తావించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో తీర్పునిచ్చిన 2006 నాటి అసలు పిటిషన్ ను (PIL) కోర్టు అస్సలు స్వీకరించి ఉండాల్సింది కాదని నిన్నటి 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణలో న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అన్ని కేసులు ముఖ్యమైనవే. శబరిమల పిల్ను కోర్టు స్వీకరించి ఉండాల్సింది కాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు మనం వార్తల్లో చూశాం. అంటే, కోర్టు స్వీకరించకూడని కేసు కోసం 9 మంది న్యాయమూర్తులు సమయం కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు, రాజ్యాంగబద్ధంగా ఎంతో కీలకమైన ఈ ఎన్నికల కమిషనర్ల నియామక కేసు ఏ విధంగానూ తక్కువ ప్రాధాన్యత కలిగినది కాదు. ఇది మిగతా అన్నిటికంటే ముఖ్యమైనది అని వ్యాఖ్యానించారు.
2023 చట్టం ప్రకారం, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రిని చేర్చారు. ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ కేసులో విచారణను వాయిదా వేయొద్దని, పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు ప్రారంభించాలని జస్టిస్ దత్తా ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు