
అమరావతి, 10 జూన్ (హి.స.)
, :రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధి లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. బుధవారం అమరావతిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యలు రాకుండా సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అధికారులకు సూచించారు.
ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలలో సరఫరాను పునరుద్ధరించాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూగర్భ కేబులింగ్ వ్యవస్థతో భవిష్యత్తులో అత్యవసర సర్వీసులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు.. తక్షణ పునరుద్ధరణకు గల అవకాశాలపై ఈ సందర్బంగా ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి చర్చించారు. ఈ సమీక్షకు ట్రాన్స్ కో జేఎండీ, సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ