
ముంబై, 10 జూన్ (హి.స.)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)
జారీ చేసిన సావనీర్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసింది. 2019-20 సిరీస్-7 కింద జారీ చేసిన గోల్డ్ బాండ్ల ఐదేళ్ల కాలపరిమితి ముగియడంతో, వాటి తుది రిడంప్షన్ ధరను ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఐదేళ్ల కాలంలో పసిడి ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరడంతో బాండ్ హోల్డర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు.
2019 డిసెంబరు 10వ తేదీన ఈ సిరీస్ బాండ్లను ఆర్బీఐ జారీ చేసినప్పుడు గ్రాము బంగారం ధర కేవలం రూ. 3,745 గా ఉండేది. కాగా, ప్రస్తుతం గడువు ముగిసే సమయానికి ఆర్బీఐ నిర్ణయించిన తుది రిడంప్షన్ ధర ఏకంగా రూ. 15,275 కి చేరుకుంది. దీని ప్రకారం, ఇన్వెస్టర్లకు కేవలం ఒక్క గ్రాము బంగారంపైనె రికార్డు స్థాయిలో రూ. 11,500 నికర లాభం దక్కింది.
ఈ ఐదేళ్ల కాలంలో బంగారంపై ఇన్వెస్టర్లు పొందిన లాభాల శాతం అక్షరాలా 307.87% గా నమోదైంది. స్టాక్ మార్కెట్లతో సమానంగా, ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ పూచీకత్తుతో ఈ స్థాయి రిటర్న్స్ రావడం బులియన్ మార్కెట్ చరిత్రలోనే విశేషంగా నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతి ఆరు నెలలకొకసారి అదనంగా లభించిన 2.5% వడ్డీ రేటు వినియోగదారులకు అదనపు లాభంగా మారింది. బంగారం ధరల్లో వచ్చిన ఈ భారీ పెరుగుదల కారణంగానే ఎస్ బీ హోల్డర్లకు ఈ స్థాయి బంపర్ ప్రాఫిట్స్ దక్కాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..