
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 12 జట్లు విశ్వవిజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో భాగంగా అన్ని జట్లు తమ గ్రూప్లోని ఇతర జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ అత్యంత బలమైన స్క్వాడు అధికారికంగా ప్రకటించాయి.
ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత మహిళల జట్టుకు స్టార్ ఆల్రౌండర్ హర్మన్డీప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది. వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన బాధ్యతలు చేపట్టనుంది. జట్టులో కీలక ఆటగాళ్లుగా షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ ఎంపికయ్యారు.
ఈ టోర్నీలో భారత జట్టుకు సంబంధించిన మ్యాచ్ల విషయానికి వస్తే.. జూన్ 14న ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తన మొదటి మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత జూన్ 17న నెదర్లాండ్స్, జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో చివరిగా జూన్ 28న బలమైన ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లన్నీ భారత్కు అత్యంత కీలకం కానున్నాయి.
భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్లను లైవ్లో వీక్షించడానికి ఐసీసీ అధికారిక బ్రాడ్కాస్ట్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంది. టీవీలో మ్యాచ్లను చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో లైవ్ను ఆస్వాదించవచ్చు. ఇక మొబైల్ లేదా ల్యాప్టాప్లలో డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా చూడాలనుకునే వారి కోసం జియోహాట్ స్టార్ యాప్, వెబ్సైట్లో ఈ టోర్నీ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల కోసం స్కై స్పోర్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, విల్లో టీవీ వంటి ప్లాట్ఫారమ్స్ అందుబాటులో ఉన్నాయి.
మహిళల టీ20 ప్రపంచకప్కు ఇంగ్లాండ్లోని మొత్తం ఏడు చారిత్రాత్మక మైదానాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ దశ, సూపర్ 8 మ్యాచ్లు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లీడ్స్లోని హెడింగ్లీ, సౌతాంప్టన్లోని హాంప్ షైర్ బౌల్, బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ వేదికలుగా జరగనున్నాయి. ఇక టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లకు ద ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తుండగా, ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..