'బత్తాయి సాగులో నల్లగొండను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి' ..మంత్రి కోమటిరెడ్డి
'బత్తాయి సాగులో నల్లగొండను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి' ..మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి


నల్గొండ, 13 జూన్ (హి.స.)

రైతుల ఐక్యత, పరస్పర సహకారం,

ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. నల్లగొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాల వల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు వరిపైనే ఆధార పడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు. పంట మార్పిడిపై తప్పనిసరి దృష్టి సారించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, రూ.500 బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అయితే బత్తాయికి పేరు ప్రఖ్యాతులు గాంచిన నల్లగొండ జిల్లాలో తిరిగి బత్తాయిని ఎక్కువ మొత్తంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని, బత్తాయి ఆరోగ్యపరంగా కూడా మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు పంట మార్పిడితో పాటు, ఉద్యాన పంటలను సాగు చేయాలని, నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు.

కార్యక్రమానికి హాజరైన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని, ముందు నుండి నల్లగొండ బత్తాయికి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రుణాలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande