
హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శల డోస్ పెంచాయి. తాజాగా జరిగిన బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల టెండర్లలో ఏకంగా రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. గురుకులాల్లో యూనిఫాంలు, టైల కోసం రూ. 1,200 కోట్లు.. ఉప్పులు, పప్పులు, చికెన్, గుడ్ల కోసం రూ. 800 కోట్లకు టెండర్లు పిలిచారని, ఈ రెండు కలిపితేనే రూ. 2,000 కోట్లు అవుతుందని లెక్కలు చెప్పారు. తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. చివరకు గురుకులాల్లో చదువుకునే పేద పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పుల్లో కూడా స్కామ్ చేస్తారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎన్నికల ముందు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా కోటీశ్వరురాలు కాలేదని, అయితే రేవంత్ అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులయ్యారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi