
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
మాదాపూర్, నగరంలో వీధి ఆహారానికి(స్ట్రీట్ఫుడ్) ప్రత్యేకమైనస్థానం ఉంది. నోరూరించే రుచులు, సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలు వీటి ప్రత్యేకత. అందుకు అనుగుణంగా పీఎంస్వనిధి పథకంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి నాణ్యతాప్రమాణాలతో సైబరాబాద్లో స్ట్రీట్ఫుడ్హబ్ ఏర్పాటు కానుంది.
రాష్ట్రంలోనే మొదటిది.. రాష్ట్రంలోనే మొదటి స్ట్రీట్ఫుడ్ హబ్ను ఐటీ కారిడార్లోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.5 కోట్లు మంజూరు చేయనుంది. సీఎంసీ కార్యాలయంలో సోమవారం కమిషనర్ సృజన ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
పర్యావరణ హితంగా.. పర్యావరణ అనుకూల నమూనాలో ఫుడ్హబ్ నిర్మించనున్నారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఆహార వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. వెదురు, పునర్వినియోగ పదార్థాలతో తయారు చేసిన ఫర్నిచర్ వినియోగిస్తారు. ఫుడ్హబ్ నిర్వహణ బాధ్యతలను స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు, గుర్తింపు పొందిన వీధి వ్యాపారులకు అప్పగించనున్నారు. 50 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన వీధి వ్యాపారులకు శిక్షణ ఇస్తారు. సందర్శకులను ఆకర్షించేలా ప్రతి వారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్ట్రీట్ ఫుడ్ హబ్ దోహదపడుతుందని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్