
ఎమ్మిగనూరు , 24 జూన్ (హి.స.)క్షణికావేశం.. మద్యం మత్తు.. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య రక్తపాతాన్ని సృష్టించాయి. నిన్నటివరకు అన్నదమ్ములు కలిసి ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ ఇంట్లో.. ఇవాళ ఒకరు శవమై పడి ఉంటే, మరొకరు హంతకుడిగా నిలబడ్డ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఎస్సి కాలనిలో నివాసం ఉంటున్న అన్నదమ్ములు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్న సమయంలో సెల్ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అన్న చిన్న.. తమ్ముడు అభిపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి దిగాడు. అన్న దాడి నుంచి తట్టుకోలేక, ఎలాగైనా తప్పించుకోవాలనే ప్రయత్నంలో తమ్ముడు అభి తీవ్ర ఆందోళనతో పరుగు తీశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో బలమైన గాయం కావడంతో 19 ఏళ్ల అభి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కళ్లముందే తమ్ముడు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. క్షణికావేశం, మద్యం మత్తు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV