హైదరాబాద్ 'గోల్డ్ మ్యాన్' పై చీటింగ్ కేసు
హైదరాబాద్ 'గోల్డ్ మ్యాన్' పై చీటింగ్ కేసు
gold


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

సోషల్ మీడియాలో ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ 'గోల్డ్ మ్యాన్'గా గుర్తింపు తెచ్చుకున్న పి. సురేశ్ కుమార్ అలియాస్ సూర్య భాయ్పై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు. తక్కువ ధరకే దిగుమతి చేసుకున్న బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తనకు అత్యంత సన్నిహితులని నమ్మించి, మార్కెట్ రేటు కంటే తక్కువకే బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకున్నాక బంగారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒక బాధితుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసిన సూర్య భాయ్, ఆ తర్వాత బంగారం ఇవ్వలేదు. బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా, వారికి మూడు ఐఫోన్లు ఇచ్చి, రూ.20 లక్షలకు చెక్కు రాసిచ్చాడు. అయితే, ఆ తర్వాత వారిని బెదిరించి ఫోన్లను తిరిగి లాక్కున్నట్టు బాధితులు తమ ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

దీంతో పాటు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసినందుకు గాను సూర్య భాయ్పై మరో కేసు కూడా నమోదైంది. అతను ఇచ్చిన సమాచారం అవాస్తవమని తేలడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మోసాల వెనుక ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్తాపూర్లో నివసించే 34 ఏళ్ల సూర్య భాయ్, ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి, తెల్లటి దుస్తుల్లో గుళ్లకు వెళ్లే వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనిపై దృష్టి సారించారు. అయితే, వారి తనిఖీల్లో అతను ధరించిన ఆభరణాల్లో చాలా వరకు నిజమైన బంగారం కాదని, చౌకబారు లోహాలతో చేసిన నకిలీవని తేలింది. తాను కోటి రూపాయల విలువైన నగలు ధరించినట్లు అతను చెప్పుకున్నప్పటికీ, అధికారులు జరిపిన విచారణలో వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని తేలడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande