
ముంబై, 28 జూన్ (హి.స.)ముంబైలో జరగాల్సిన మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని, పెద్ద ఎత్తున సామూహిక విషప్రయోగానికి పన్నిన భారీ కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూణెకు చెందిన ఓ వ్యాపారవేత్తను అరెస్టు చేసి, అతడి నుంచి దాదాపు 15,000 విషపూరిత క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సత్వర స్పందనతో నగరంలో ఓ పెను విషాదం తప్పినట్లయింది.
పోలీసుల కథనం ప్రకారం, పూణెలోని విమాన్ నగర్కు చెందిన పెయింట్ వ్యాపారి ఫయాజ్ ప్రేమ్జీ (39) ఈ కుట్రకు పాల్పడ్డాడు. దక్షిణ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఓ అతిథి గృహంలో బస చేసిన ఆయన, మొహర్రం ఊరేగింపులో పాల్గొనే భక్తులకు నొప్పి నివారణ మందులు లేదా ఇమ్యూనిటీ బూస్టర్లని నమ్మించి ఎలుకల మందు నింపిన క్యాప్సూల్స్ను పంపిణీ చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి మాత్ర ఇవ్వగా, అతడికి వాంతులు, కడుపునొప్పి రావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి అత్యంత విషపూరితమైన జింక్ ఫాస్ఫైడ్తో నింపిన 14,900 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
గడిచిన ఏడాది కాలంలో నిందితుడు ఇరాన్, ఇరాక్ దేశాలకు 19 సార్లు ప్రయాణించినట్లు విచారణలో తేలింది. అతడి తల్లి, సోదరి ప్రస్తుతం ఇరాన్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుట్ర వెనుక అంతర్జాతీయ కోణం ఉందా? లేక ఒంటరిగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద హత్యాయత్నం, విషప్రయోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi