
హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా మళ్లీ గుర్తింపు పొందారు. ఆయన పదవీకాలం ఈనెల 25తో ముగియనుండగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈనెల 26నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ PC మోదీ బులెటిన్ విడుదల చేశారు.
అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్లో సోమవారం మల్లికార్జున ఖర్గే ప్రమాణం చేశారు. ఖర్గే చేత రాజ్యసభ ఛైర్మన్ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖర్గే తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ప్రతిపక్ష నాయకుడిగా తన సేవలను కొనసాగిస్తానని ఖర్గే అన్నారు. రాజ్యసభకు తన పునఃనియమించడాన్ని, ప్రతిపక్ష నాయకుడిగా తనను కొనసాగించడాన్ని అపారమైన గర్వకారణంగా అభివర్ణించారు. అటు అధికారులు, పార్టీ నాయకత్వం, రాజకీయ సహచరులు అందించిన మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi