
మెదక్, 30 జూన్ (హి.స.)
పక్కాగా భూ హక్కుల కోసం రీ సర్వే
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలంలోని బీక్యా తండాలో భూ భారతి భూముల రీ సర్వే గ్రామసభకార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో, ఏడీ సర్వే, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, గ్రామ సర్పంచ్ విజయ్ నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ శివంపేట మండలంలో 1946 సంవత్సరంలో రీ సర్వే జరిగిందని, అప్పటి నుంచి అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. భూమి క్రయ, విక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలని సూచించారు.
గ్రామాల్లో భూ నక్షాల్లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతాన్ని ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందుపరుస్తామని అన్నారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేసి, భూమికి భూధార్ను అందిస్తామని తెలిపారు. భూ సమస్యలు లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి కిషన్, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు