
రాజన్న సిరిసిల్ల, 30 జూన్ (హి.స.)
విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పాఠశాల పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన తరగతి గదులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అలాగే ఉద్యోగ విరమణ పొందుతున్న జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఓ ఉపాధ్యాయుడిని సన్మానించి వారి సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ విద్యాలయంలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. పాఠశాలలో బోధన, వసతులపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 400 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. పదో తరగతిలో ఈ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్న కలెక్టర్, ప్రతి విద్యార్థి తమ నేపథ్యం ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. పక్కా ప్రణాళికతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. వి
పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఈ పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు జీవితంలో దిశానిర్దేశం చేసిందన్నారు. ఒకప్పుడు ఈ పాఠశాలలో ప్రవేశం పొందడం ఎంతో కష్టంగా ఉండేదని, తల్లిదండ్రులకు ఈ పాఠశాలపై అపారమైన నమ్మకం ఉందని గుర్తు చేశారు.
ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు