
హైదరాబాద్, 30 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి
(కేబినెట్) అత్యవసర సమావేశం ఫిక్స్ అయింది. జూలై 2వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3:00 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులో గల కేబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం అధికారిక ఉత్తర్వులు (U.0. Note) జారీ చేశారు.
కేబినెట్ భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు అజెండా రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, మరియు వివిధ శాఖల కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన అజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, వాటిని తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను రేపు అనగా జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల కల్లా ఖచ్చితంగా పంపాలని సీఎస్ ఆదేశించారు. ఒకవేళ ఏ శాఖలోనైనా అజెండా అంశాలు లేనట్లయితే.. 'నిల్' (NIL) రిపోర్టును కూడా నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు. మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి
పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులందరూ ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో (హెడా క్వార్టర్స్) అందుబాటులో ఉండాలని సీఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కీలక సమావేశానికి సంబంధించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రోటోకాల్ డైరెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్, సచివాలయ బ్రాంచ్ TGTS యూనిట్ మేనేజర్, ట్రాన్స్ లేషన్స్ డైరెక్టర్ లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ, పరిపాలనాపరమైన పరిణామాలు, పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు