

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇక బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స స్థానికంగానే
న్యూఢిల్లీ, జూలై 1: అసోం రాష్ట్రం గువాహటిలో ఉన్న డాక్టర్ భువనేశ్వర్ బోరువా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (బీబీసీఐ)లో 292 పడకలతో అత్యాధునిక బాలలు, పెద్దల రక్త క్యాన్సర్ చికిత్స కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త యూనిట్ ప్రారంభమైతే ఈశాన్య రాష్ట్రాల వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటి వరకు చికిత్స కోసం ఢిల్లీ, ముంబై, వెల్లూరు వెళ్లాల్సిన పరిస్థితి చాలా వరకు తగ్గనుంది.
ఈ కేంద్రంలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్, అత్యాధునిక కీమోథెరపీ, పిల్లల క్యాన్సర్‌కు ప్రత్యేక చికిత్స, ఆధునిక ఐసీయూ వంటి ప్రపంచ స్థాయి వైద్య సేవలు ఒకేచోట లభిస్తాయి. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది కొత్త ఆశను కలిగించనుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-డివైన్ (PM-DevINE) పథకం కింద, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. నిర్మాణం దాదాపు 78.90 శాతం పూర్తికాగా, తుది మెరుగుల పనులు కొనసాగుతున్నాయి. 2023 మే 31న పనులకు ఆమోదం లభించగా, ఈ ఏడాది జూన్ నాటికి రూ.33.91 కోట్లు విడుదలయ్యాయి. నిర్ణయించిన గడువులోనే ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీబీసీఐ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బిభూతి భూషణ్ బోర్తాకూర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఈశాన్య భారతంలో క్యాన్సర్ చికిత్సకు కొత్త దిశ చూపుతుందని తెలిపారు. పిల్లలు, పెద్దలకు రక్త క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. భవిష్యత్తులో రోబోటిక్ శస్త్రచికిత్సలు, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను కూడా దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సౌకర్యం బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్. ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్, తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు చికిత్స కోసం దేశంలోని కొద్ది ప్రత్యేక ఆసుపత్రులకే వెళ్లాల్సి వస్తోంది. ఈ సదుపాయం గువాహటిలో అందుబాటులోకి వస్తే రోగులకు వేగంగా చికిత్స ప్రారంభమవడంతో పాటు చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.
బీబీసీఐ ఇప్పటికే పలు విశేష విజయాలు సాధించింది. దేశంలో తొలిసారిగా సామాజిక స్థాయిలో కడుపు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, పరిశోధనలు నిర్వహించడం, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించే పరీక్షలు చేపట్టడంలో కూడా ముందంజలో ఉంది. లైఫ్ ప్రోటాన్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ వల్ల మరణాలను తగ్గించాలంటే ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సే అత్యంత ప్రభావవంతమైన మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.300.16 కోట్లు. ఇందులో 292 పడకలతో ఆధునిక ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నారు. ఏడు అంతస్తుల ఈ భవనం విస్తీర్ణం సుమారు 19,675 చదరపు మీటర్లు. ఓపీడీ, ఐపీడీ, ఐసీయూ, స్టెప్‌డౌన్ ఐసీయూ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ప్రయోగశాలలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనుబంధ వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అలాగే వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఆధునిక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం గువాహటి బీబీసీఐ ఈశాన్య భారతంలోనే అతిపెద్ద క్యాన్సర్ చికిత్స కేంద్రంగా సేవలందిస్తోంది. అణుశక్తి విభాగం సహకారంతో, ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రతి సంవత్సరం 40 వేల నుంచి 45 వేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తుండగా, సగటున 12 వేల కొత్త కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. అందుకే బీబీసీఐను ఈశాన్య భారత క్యాన్సర్ చికిత్సకు ప్రధాన కేంద్రంగా భావిస్తున్నారు.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి లక్ష జనాభాకు 90 నుంచి 120 క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య 220 నుంచి 270 కేసుల వరకు చేరుతోంది. ప్రతి ఏడాది 45 వేలకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పొగాకు, సుపారీ వినియోగం, ఆహారపు అలవాట్లు, ఇతర సామాజిక, భౌగోళిక కారణాల వల్ల ఈ ప్రాంతంలో క్యాన్సర్ భారము ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఐసీఎంఆర్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సిక్కింలో 95 శాతం, నాగాలాండ్‌లో 58 శాతం, మణిపూర్‌లో 16 శాతం, మేఘాలయలో 13 శాతం మంది ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్, పిల్లల క్యాన్సర్ చికిత్సలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూడటం, దూర ప్రయాణాలు చేయడం వల్ల చికిత్స ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో గువాహటిలో ఏర్పడుతున్న ఈ కొత్త క్యాన్సర్ యూనిట్ ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు గొప్ప వరంగా నిలవనుంది.
కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో ప్రకటించిన పీఎం-డివైన్ పథకం కింద ఈ ప్రాజెక్టు అమలవుతోంది. తొలి దశలో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం లక్ష్యం ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక వసతుల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం. బీబీసీఐలో నిర్మిస్తున్న ఈ క్యాన్సర్ యూనిట్ ఆ పథకంలో అత్యంత కీలకమైన ఆరోగ్య ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi