
హైదరాబాద్, 14 జూలై (హి.స.)
ఏఐ సహాయంతో యువతో నైపుణ్యాలను పెంచవచ్చని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక భద్రత దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ టెక్నాలజీతో దేశంలో పెనుమార్పులు వస్తున్నాయని, లేటెస్ట్ టెక్నాలజీ వాడకంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. వీటివల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని వీడి.. అందుకు తగ్గట్లుగా స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. పరిశ్రమలు, కార్మిక సంఘాలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి మన్ సుఖ్ మాండవీయ కొనియాడారు. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు కూడా అభివృద్ధిపై పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
టెక్నాలజీలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అసంఘటిత రంగ కార్మికులను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ-శ్రమ్ పోర్టల్ విజయవంతమైందని, దీని ద్వారా కార్మికులకు సామాజిక భద్రత పథకాలు నేరుగా అందుతున్నాయని ఆయన గుర్తుచేశారు. భారతీయ కార్మికులకు అంతర్జాతీయంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించేలా పరస్పర వలస, ఉపాధి ఒప్పందాలపై దృష్టి పెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..