సిక్కోలు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనున్న మూలపేట పోర్టు..
సిక్కోలు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనున్న మూలపేట పోర్టు..
సిక్కోలు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనున్న మూలపేట పోర్టు..


అమరావతి, 16 జూలై (హి.స.)

సిక్కోలు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది మూలపేట పోర్టు.. తొలిదశ పనులు దాదాపు పూర్తిస్థాయి దశకు చేరుకున్నాయి. బెర్తులు, ఇతర నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో పోర్టు ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం గుర్తించింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. తాజాగా రెండో దశ విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 1903.39 ఎకరాల సేకరణకు రూ.440.52 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాంతంలోని దాదాపు 5 వేల ఎకరాల ఉప్పు భూములను విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు బదలాయించేందుకు నిర్ణయించింది. ఇందులో నాల్కో, గెయిల్ పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా పోర్టు విస్తరణ కోసం భూసేకరణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయిండం చర్చనీయాంశంగా మారింది.

మూలపోర్టు మొదటివిడత పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరోపక్క జాతీయ రహదారిని కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వేలైను నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. పోర్టు గుత్తేదారు త్వరితగతిన పనులు చేపట్టేలా జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.

భూములు గుర్తించేందుకు కసరత్తు

సంతబొమ్మాళి మండలం పోతినాయుడుపేట సర్వేనంబరు 346లో 156 ఎకరాలు ఇనాం భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు గ్రామంలో బహిరంగ ప్రకటనలు జారీ చేశారు. మరోవైపు ఆకాశలఖవరం, కాకరాపల్లి మధ్యలో 1,200 ఎకరాల ఏపీఐఐసీ భూములు అందుబాటులో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande