ఈ నెల 22 న తల్లికి వందనం నిధులు.విడుదల
ఈ నెల 22 న తల్లికి వందనం నిధులు.విడుదల
Ap


అమరావతి, 16 జూలై (హి.స.)

ఏపీలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం రూ.10,120.78 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల్లో చదువుతున్న ప్రతి చిన్నారికి ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13వేలు, పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు చేస్తోంది. ఈ పథకంతో 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42.70లక్షల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది.

ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలను ప్రభుత్వం వెరిఫై చేసింది. అర్హులైనవారి జాబితాను 22నే స్వర్ణ గ్రామ,వార్డు కార్యాలయాల్లో ప్రకటించి అదే రోజు వారి ఖాతాలకు నగదు జమ చేయనుంది. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు అర్హతను బట్టి ఆగస్ట్ 30 నాటికి వారి తల్లుల ఖాతాలలో ఆర్థికసాయం జమచేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande