
హైదరాబాద్, 16 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
గురువారం పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్
కల్యాణ్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో
విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గవర్నర్ ఆయన నివాసానికి
చేరుకుని, ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు.
శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని గవర్నర్ అడిగి
తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలను, సలహాలను
తప్పనిసరిగా పాటించాలని పవన్‌కు సూచించారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని,
ప్రజాసేవలో తన విధులను తిరిగి ప్రారంభించాలని గవర్నర్ మనస్ఫూర్తిగా
ఆకాంక్షించారు.
ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ జస్టిస్ నజీర్, పవన్
కల్యాణ్ నివాసంలో ఉన్న గ్రంథాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించడం విశేషం. ఆ లైబ్రరీలో
ఉన్న పలు పుస్తకాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రాసిన అనేక గ్రంథాలను చూసి, వాటిపై పవన్ కల్యాణ్‌తో ఉత్సాహంగా చర్చించారు. ఇద్దరి మధ్య
పుస్తకాలపై ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన అభ్యర్థన మేరకు, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓ పుస్తకంపై తన సంతకం చేశారు. తన ఆరోగ్యం
గురించి వాకబు చేసేందుకు స్వయంగా సమయం తీసుకుని ఇంటికి వచ్చిన గవర్నర్‌కు పవన్
కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన పూర్తిగా మర్యాదపూర్వకంగా,
ఆత్మీయ వాతావరణంలో సాగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi