
హైదరాబాద్, 16 జూలై (హి.స.)
పవిత్రమైన పూరీ జగన్నాథుని రథయాత్రను
పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని
పవన్ కల్యాణ్ భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్నాథుని
ఆశీస్సులతో దేశమంతా సుభిక్షంగా, శాంతిసంతోషాలతో విలసిల్లాలని ఆయన
ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఒక భక్తిపూర్వక సందేశాన్ని
పంచుకున్నారు.
పవిత్రమైన ఈ రథయాత్ర అనేది కేవలం ఒక
ఉత్సవం మాత్రమే కాదని.. అది అచంచలమైన విశ్వాసానికి, భక్తికి,
అలాగే భగవంతునికి, భక్తుడికి మధ్య ఉండే శాశ్వతమైన
ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీక అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. పవిత్ర రథాలపై
స్వామివారు, అమ్మవారు ముందుకు సాగుతుండగా... ఆ
జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిల
దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి హృదయానికి శాంతిని, ప్రతి
కుటుంబానికి మానసిక బలాన్ని, ప్రతి జీవితానికి సరికొత్త ఆశను
ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆ కలియుగ దైవం మనందరినీ ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడిపించి, మన ఇళ్లను సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో
నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దీనితో పాటు, సమాజానికి
వినమ్రతతో, నిష్కల్మషమైన భక్తితో సేవ చేసేలా..
మనందరికీ అవసరమైన జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఆ స్వామి ప్రసాదించాలని
కోరారు. ఈ పవిత్రమైన రోజున జగన్నాథుని దివ్య అనుగ్రహం మన జీవితాల్లో సరికొత్త
వెలుగులు నింపి, శాంతి, ఐక్యత,
ఆధ్యాత్మిక బలంతో కూడిన ఒక ఉన్నతమైన భవిష్యత్తు వైపు మన సమాజాన్ని
నడిపించాలని ఆకాంక్షించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi