విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం.. 'ఆరోగ్య పాఠశాల'కు మరింత బలోపేతం.. కలెక్టర్
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం.. 'ఆరోగ్య పాఠశాల'కు మరింత బలోపేతం.. కలెక్టర్
Collector


ఆదిలాబాద్, 02 జూలై (హి.స.)

విద్యార్థుల ఆరోగ్యం, విద్య,భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా జిల్లాలో అమలు చేస్తున్న 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం బజార్హీత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన మూడో విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలోని అంశాలపై అవగాహన కల్పించారు. అధికారులు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం వంటి ఆరు ప్రధాన అంశాలపై విద్యార్థులకు వివరించారు.

కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో గత రెండేళ్లుగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని, దీనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు, అవార్డులు లభించాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల రక్షణ కోసం పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు 'పోక్సో క్యాలెండర్' రూపొందించామని చెప్పారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా, గోప్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెల మొదటి తేదీన వాటిని తెరిచి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ప్రతి కుటుంబం ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకుని వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఖాన్ అకాడమీ ద్వారా గణితం, సైన్స్లో పట్టు సాధించాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande