
నిజామాబాద్, 02 జూలై (హి.స.) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పాఠశాలలు, కళాశాలల్లో అక్రమంగా ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. వసతుల కొరత, పుస్తకాల విక్రయం వంటి అంశాల పేరుతో యాజమాన్యాలను, సిబ్బందిని బెదిరించడం, విద్యార్థులను భయాందోళనలకు గురిచేయడం, విద్యాసంస్థల పనితీరుకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్, బర్దిపూర్ శివారులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో అక్రమంగా ప్రవేశించి కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన ఘటనలో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలోని శ్రీ సాయి విద్యాలయం పాఠశాలలో అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరించడం, విద్యార్థులను భయాందోళనలకు గురిచేయడం, వస్తువులు ధ్వంసం చేసిన ఘటనలోనూ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుల్లో నిందితులకు గతంలోనూ కేసులు ఉంటే అదనపు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత జిల్లా అధికారులు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు నిబంధనల ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని సీపీ తెలిపారు. విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాలల్లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించడం, యాజమాన్యాల నిర్వహణకు భంగం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..