
హైదరాబాద్, 02 జూలై (హి.స.)
అప్పులపై చర్చకు రావాలని సీఎం
రేవంత్ రెడ్డి తొలుత సవాల్ చేశారని, ఆ సవాలును తాము స్వీకరించాక తోకముడిచారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కిన వేళ.. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చర్చకు స్పందించకుండా ఉన్నపుడు.. సందట్లో సడేమియాలా మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలో దూరారన్నారు. తెలంగాణ భవన్ కు వచ్చి అప్పులపై చర్చిస్తామని అన్నారని, అందుకే ఆయన కోసం ఎదురుచూశామన్నారు. ఇప్పుడేమో గన్ పార్క్ వద్దకు రావాలంటున్నారని, అక్కడికి వెళ్లాక చార్మినార్ కు రావాలంటారేమో అని సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్ కు వస్తామన్న జూపల్లి గన్ పార్క్ వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చర్చకు రెడీ అని డైలాగులు కొట్టి పారిపోవడం కాదని, దమ్ముంటే చర్చించేందుకు రావాలన్నారు.
గన్ పార్క్ వద్దకు వెళ్తున్న హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తోంది ఎవరు? అని ప్రశ్నించారు. తన శాఖలో ఏం జరుగుతుందో కూడా మంత్రి జూపల్లికి తెలియదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పంచాయతీతో ఒక ఐఏఎస్ అధికారి రాజీనామా కూడా చేశారని, సీఎం రేవంత్ పాలన అసమర్థుడి జీవన యాత్రలా ఉందని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో తాము లక్ష ఇళ్లను నిర్మించామని, కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టినా దేనికైనా రెడీగా ఉన్నామన్నారు. జూపల్లికి దమ్ముంటే గన్ పార్క్ వద్దే ఉండాలని, అక్కడే అన్నీ చర్చిద్దామన్నారు. ప్రభుత్వానికి దేనిపైనా చర్చించే దమ్ములేదన్న కేటీఆర్.. చేతకానీవాళ్లు ఎందుకు సవాల్ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలను ముందుంచుతామని అనుకున్నామన్నారు. సవాళ్లను స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..