కలెక్టర్ కాదు.. క్లాస్ టీచర్.. విద్యార్థులకు స్వయంగా పాఠాలు చెప్పిన భవేష్ మిశ్రా
కలెక్టర్ కాదు.. క్లాస్ టీచర్.. విద్యార్థులకు స్వయంగా పాఠాలు చెప్పిన భవేష్ మిశ్రా
Collector


నిర్మల్, 02 జూలై (హి.స.)

నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ఉపాధ్యాయుడిగా మారారు. తాను స్వయంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థులతోనూ వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా సహచర విద్యార్థులకు పాఠాలు చెప్పించారు. పిల్లలతో మమేకమై గడిపారు. ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసి హడలెత్తించారు. కేవలం పుస్తకాల్లోని పాఠాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా, వాటిని సమాజంలో జరుగుతున్న పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. గురువారం సోన్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా బోధన, వసతి, ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. అనంతరం వంటశాల, సరుకుల నిల్వ గది, భోజనశాలను తనిఖీ చేసి అక్కడి పరిశుభ్రత, ఆహార నాణ్యత పై అధికారులకు పలుసూచనలు చేశారు. మెస్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, వంటశాలలో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు, స్టాక్ రిజిస్టర్ను క్రమం తప్పకుండా నవీకరించాలని సూచించారు.

అనంతరం పదో తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి జవాబు పత్రాలను పరిశీలించి, గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. కొంతమంది విద్యార్థులను బోర్డు పై లెక్కలు చేయించి, సమస్యల పరిష్కార విధానాన్ని వివరింపజేశారు. శాస్త్రవేత్తల కృషి విజ్ఞాన శాస్త్రం సమాజ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్ర గురించి వివరించి, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీన సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande