
రామాయపట్నం, 20 జూలై (హి.స.)రామాయపట్నం పోర్టు విషయంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును టీడీపీ పెద్దల జేబులు నింపేందుకు ఓ భారీ స్కామ్‌గా మార్చారని, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేందుకు సిద్ధమయ్యారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.
మా హయాంలో పురోగతి... ఇప్పుడు ప్రైవేటుపరం
నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి పోర్టులే కీలకమని భావించిన తమ ప్రభుత్వం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించిందని జగన్ గుర్తుచేశారు. ఈ మూడు పోర్టులకు సంబంధించి భూసేకరణ, అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణ వంటి అత్యంత క్లిష్టమైన పనులన్నీ తమ హయాంలోనే పూర్తయ్యాయని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల పూర్తి కోసం ఈపీసీ కాంట్రాక్టులను కూడా ఖరారు చేసి, 2024 జూన్ నాటికి నిర్మాణ పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించామని తెలిపారు. ఇంత కష్టపడి ఒక రూపు తీసుకొచ్చిన పోర్టును ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.
పోర్టుతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు
రామాయపట్నం పోర్టు వల్ల రాష్ట్రానికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయని జగన్ తన పోస్టులో ప్రస్తావించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సుమారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పూర్తిగా రామాయపట్నం పోర్టుపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ముడి చమురు దిగుమతికి ఈ పోర్టు కీలకం కానుందన్నారు.
అలాగే, ఇండోసోల్ సోలార్ సంస్థ ఏర్పాటు చేయనున్న గిగా స్కేల్ తయారీ ప్లాంటుకు కూడా ఈ పోర్టే ఆధారం అని తెలిపారు. ముడిసరుకుల దిగుమతికి, తయారైన సోలార్ మాడ్యూళ్ల ఎగుమతికి ఈ డీప్ వాటర్ పోర్టు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
వీటితో పాటు, వైఎస్సార్ కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడి ఇనుము, కోకింగ్ కోల్ వంటివి దిగుమతి చేసుకోవడానికి రామాయపట్నం పోర్టులో ఆ సంస్థ రెండు బెర్తులను అభివృద్ధి చేస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులన్నీ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి పన్నుల రూపంలో భారీ ఆదాయాన్ని సమకూరుస్తాయని జగన్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi