
మంగళగిరి , 20 జూలై (హి.స.)
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న జఠిలమైన భూ సమస్యకు రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం చూపారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం కింద రెండో విడతలో సుమారు 3,000 కుటుంబాలకు ఈ నెల 21, 22 తేదీల్లో శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలోని కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. అయితే, ఆ స్థలాలపై వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఆస్తులను పిల్లలకు బదిలీ చేయాలన్నా, అత్యవసరానికి రుణం పొందాలన్నా వీలుకాని దుస్థితి నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను గుర్తించిన లోకేశ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తొలి విడతలో భాగంగా రత్నాల చెరువు, యర్రబాలెం, నీరుకొండ వంటి ప్రాంతాల్లో 3,002 మందికి సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములపై శాశ్వత హక్కులు కల్పించారు.
ప్రస్తుతం రెండో విడతలో భాగంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ విడతలో అందించే పట్టాల మార్కెట్ విలువ కూడా సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi