
హైదరాబాద్, 21 జూలై (హి.స.)బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా తాజా వివరాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపితే వారి ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని రిజర్వు బ్యాంకు సూచించింది. ‘మీ ఖాతాదారుడి వివరాలు తెలుసుకోండి’ (నో యువర్ కస్టమర్ -కేవైసీ) అనే కార్యక్రమాన్ని ప్రతి బ్యాంకు విధిగా నిర్వహించాలంది. బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న లావాదేవీల వివరాలను బట్టి వాటిని మూడు రకాలుగా విభజించేలా సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఒక్కోసారి కనీసం రూ.50 వేలకు మించి లావాదేవీలు ఎక్కువ సంఖ్యలో తరచూ జరిపే ఖాతా ‘ఎక్కువ ముప్పు’(‘హైరిస్క్’) అని గుర్తించి.. ఈ ఖాతాదారుల కేవైసీ వివరాలను రెండేళ్లకొకసారి సేకరించాలి.
లావాదేవీలు కాస్త తక్కువగా ఉన్నవాటిని ‘మీడియం రిస్క్’ అని వారి వివరాలను ఎనిమిదేళ్లకు, అరుదుగా లావాదేవీలు జరిపేవాటిని ‘తక్కువ ముప్పు’(లోరిస్క్) పేరుతో ప్రతీ పదేళ్లకొకసారి కేవైసీని బ్యాంకులు సేకరించాలి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం(31.03.2026) నాటికి 24,59,248 కేవైసీ వివరాలు ఇవ్వని బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో 2,88,122 అసలు లావాదేవీలు జరగడం లేదని గుర్తించారు. ఒక ప్రధాన పెద్దబ్యాంకులోనే 9.99 లక్షలు, మరో సాధారణ బ్యాంకులో 4.13 లక్షల ఖాతాలు రీ-కేవైసీ కోసం పెండింగులో ఉన్నట్లు తేలింది. కేవైసీ తాజా సమాచారం అడిగినా ఇవ్వని వారి ఖాతాల ఫ్రీజింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రిజర్వు బ్యాంకు పేర్కొంది. ఎప్పటికప్పుడు రీ-కేవైసీ, అవసరమైతే ఖాతాల ఫ్రీజింగ్ ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్