
హైదరాబాద్, 21 జూలై (హి.స.)దేవాదాయ శాఖలో సాంకేతిక ఆధారిత పాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులకు వేగంగా పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖలో అమలు చేస్తున్న దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్), యాదగిరి ట్రస్ట్ బోర్డు చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమావళిపై ఆమె మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్, దేవాదాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. టీఏఐఎంఎస్ ద్వారా రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరించే దిశగా చేపడుతున్న చర్యలు, వివిధ మాడ్యూళ్ల రూపకల్పన, ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై మంత్రి సురేఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్