
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ
పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడమే కాకుండా హింసాత్మకంగా మారింది. విద్యార్థులు, నిరసన కారులకు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు రావడంతో ఆగ్రహంతో ఊగిపోయి.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో నీట్ అక్రమాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఆవరణలో స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు తెలియగానే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 13 మంది ప్రధాన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఏ ద్వారా రీ-ఎగ్జామ్ పూర్తి చేసి ఫలితాలను కూడా విడుదల చేశామని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా పటిష్టమైన సురక్షిత వ్యవస్థను రూపొందిస్తూ, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ తెలిపారని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశాభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన కీలక బిల్లులను ఆమోదింపజేయడంలో ఎన్డీఏ కూటమి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే అయినప్పటికీ, దేశ భవిష్యత్తును మరియు యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలు కూడా సహకరించాలని కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..