ఒడెస్సాలో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతిపై రష్యాకు భారత్ సమన్లు
ఒడెస్సాలో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతిపై రష్యాకు భారత్ సమన్లు
ఒడెస్సాలో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతిపై రష్యాకు భారత్ సమన్లు


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయ పౌరులు మరణించడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, న్యూఢిల్లీలోని రష్యా తాత్కాలిక రాయబారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) నేడు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.

విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జులై 19వ తేదీ సాయంత్రం ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరిన 'ఎంవీ గోల్డెన్ లియో' అనే వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఘటన సమయంలో నౌకలో ఐదుగురు భారతీయులు సహా మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది.

వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులను భారత్ ఖండిస్తోంది. అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం, స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఆటంకం కలిగించడం వంటి చర్యలు తీవ్రంగా ఖండించదగినవి. ఇలాంటివి పునరావృతం కాకూడదు అని భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

'కీవ్' పోస్ట్ కథనం ప్రకారం.. రష్యా ప్రయోగించిన క్షిపణి ఈ నౌకను ఢీకొట్టడంతో ఈ ఘటనలో మొత్తం 10 మంది మరణించారు. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ టర్కిష్ యాజమాన్య నౌకపై రష్యా దళాలు ఖే-59/ఖే-69 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో ఒకటి నౌకను తాకడంతో మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ వైమానిక దళం ఆరోపించింది.

మరోవైపు ఈ దాడులపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉక్రెయిన్ సైనిక దళాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న నౌకలు, ఓడరేవుల మౌలిక సదుపాయాలపైనే తాము దాడులు కొనసాగిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సైనిక సామగ్రిని రవాణా చేస్తున్న రెండు బల్క్ క్యారియర్‌లను ఒడెస్సా పోర్టు సమీపంలో లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. ఈ ఘటనతో ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం భారత పౌరులపై ప్రత్యక్షంగా పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande