విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భట్టి


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా పోషక విలువలతో కూడిన బలమైన ఆహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రమైన మధిర విజయవాడ రోడ్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మధిర మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, బలమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక చాలామంది ఉచిత పథకాల పైన విమర్శ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి పైన ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడి ఫలితాలు ప్రజలు అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేసేవిగా ఉంటాయని ఆయన అన్నారు.

మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు.

ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదు.. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ.. రాష్ట్ర భవిష్యత్తు ఆని ఆయన చెప్పారు వారి భవిష్యత్తే మన భవిష్యత్తు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసి చదువుకోవాలని అన్నారు. రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన న్యూట్రీషియస్ ఫుడ్ ని మనం అందించాలని చెప్పి ఈ క్యాబినెట్ చేసిన నిర్ణయం మేరకు బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. మానవ వనరులు మన రాష్ట్ర సంపద. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో.. సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క నొక్కి వక్కాణించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande