
న్యూఢిల్లీ, 28 జూలై (హి.స.)
నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా
దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఎవరైనా సరే పరిమితి దాటి ప్రవర్తించినా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడినా వారిని విచారించి కఠినంగా శిక్షించాల్సిందే అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కేవలం ఆందోళనలు చేస్తున్నారనే కారణంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, అపరిమిత బలాన్ని ప్రయోగించడం సరికాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో నిరసనకారులైనా, పోలీసులైనా స్వీయ క్రమశిక్షణ పాటించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని న్యాయస్థానం గుర్తుచేసింది. ఆందోళనల్లో భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, హింసను ప్రేరేపించడం కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసనల నిర్వహణ, పోలీసు చర్యలపై స్పష్టమైన సమగ్ర మార్గదర్శకాలను (SOP) రూపొందిస్తామని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..