
హైదరాబాద్, 28 జూలై (హి.స.)
నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, అలాగే అరెస్టయిన వారిని విడుదల చేయాలని అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 5 కేసులు నమోదవగా, 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని, లేకుంటే మళ్లీ నిరసనలు మొదలుపెడతామని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించిన నేపథ్యంలో అస్సాం హోం మరియు రాజకీయ వ్యవహారాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం ప్రకారం, అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేస్తారు. కేసుల విచారణ ఏ దశలో ఉన్నప్పటికీ వాటిని చట్టబద్ధంగా ఉపసంహరించుకునే ప్రక్రియ వేగవంతం చేయబడుతుంది. నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన లేదా ప్రతికూల చర్యలు తీసుకోబోమని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిసినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
జూలై 23న గౌహతిలో నీట్ లీకేజీకి నిరసనగా, విద్యా రంగంలో సంస్కరణలు కోరుతూ భారీ ఆందోళన జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర ఒత్తిడి మరియు నిరసనల కారణంగా జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi